Menu Close

20 Moral Stories in Telugu For Children – నీతి కథలు – పిట్ట కథలు

Lowest Price - Shop Now

32 Inch TV - High Quality Screen - Android - Dolby

మాటంటే మాట – Telugu Funny Stories

సుబ్బమ్మ, గంగరాజు మొగుడు పెళ్ళాలు. ఇద్దరికీ అస్సలు పడదు. చీటికీ మాటికీ తిట్టుకునేవారు. రోజూ గొడవలు, అరుపులు, కేకలే. చుట్టుపక్కల వాళ్ళకు తల వాచిపోయేది. దాంతో ఒకరోజు అందరూ వచ్చి “మీరు ఒకరితో ఒకరు మాటలాడితేనే గదా గొడవలు. ఏదయినా సరే కొంతకాలం నోరు తెరవకుండా కాగితం మీద రాసి చూపించుకోండి. దాంతో నెమ్మదిగా గొడవలు తగ్గిపోతాయి” అని సలహా ఇచ్చారు. వాళ్ళు “సరే” అన్నారు.

తరువాత రోజు పొద్దున్నే ఐదుకంతా గంగరాజు ఊరికి పోవాలి. దాంతో “రేపు ఉదయం ఐదుకంతా లేపు. పక్క ఊరిలో చాలా అవసరమైన పని వుంది. తొందరగా వెళ్ళాలి” అంటూ చీటీ మీద రాసి సుబ్బమ్మకు ఇచ్చి పడుకున్నాడు. తరువాత రోజు ఉదయం లేచేసరికి ఎప్పటిలాగే పదయింది. గంగరాజుకు పెళ్ళాం మీద చాలా కోపం వచ్చింది. “ఏమే పొద్దున్నే లేపమంటే లేపవా. ఎంత పొగరు నీకు” అంటూ సుబ్బమ్మను తిట్టడానికి విసురుగా పైకి లేచాడు. అంతలో అతనికి మంచం మీద ఒక చీటీ కనబడింది. తీసి చూశాడు. అందులో “పొద్దున్నే ఊరుకి పోవాలి. లేపమన్నావు కదా. లే. ఐదయింది” అని రాసి వుంది.

పదవి ఎవరికి – Telugu Moral Stories

మహారాజు కోశాధికారి పదవికి కొత్తవారిని ఎన్నిక చేయాలి అనుకున్నాడు. వచ్చిన వారిలో గోవిందుడు, సునందుడు సరిసమానంగా నిలబడ్డారు. పదవి ఎవరికి ఇవ్వాలో రాజుకు తోచలేదు. సైనికాధికారిని పిలిచి ఒకరిని ఎన్నిక చేయమని చెప్పాడు. సైనికాధికారి ముందుగా గోవిందున్ని పిలిచాడు. “చూడు… మీ ఇద్దరిలో నేను ఎవరి పేరు చెబితే మహారాజు వారికే పదవి ఇవ్వడం జరుగుతుంది. రేపటిలోగా నా చేతిలో వేయి వరహాలు పెడితే నీ పేరే చెబుతాను. ఏమంటావ్” అన్నాడు. గోవిందుడు అందుకు సరేనని ఒప్పుకున్నాడు.

తరువాత సైనికాధికారి సునందున్ని పిలిచి అతనికీ అదే మాట చెప్పాడు. కానీ సునందుడు ఒప్పుకోలేదు. ‘నా తెలివితేటల వల్ల పదవి రావాలి కానీ లంచం ఇవ్వడం వల్ల కాదు. ఇటువంటి పదవి నాకొద్దు” అంటూ వెళ్ళిపోయాడు. తరువాత రోజు ఉదయం గోవిందుడు వేయి వరహాలు తీసుకొని సైనికాధికారిని కలిశాడు. కానీ కోశాధికారి పదవికి సునందున్ని నియమించారని తెలిసి నివ్వెరపోయాడు..

సైనికాధికారి గోవిందునితో చూడు… కోశాధికారి పదవికి నిజాయితీ చాలా అవసరం. అది మీ ఇద్దరిలో ఎవరికి వుందో తెలుసుకోవడం కోసం లంచం అడిగాను. ఈ రోజు లంచం ఇచ్చేవాడు రేపు లంచం తీసుకోవడానికి కూడా వెనుకాడడు. నీ వంటి వాళ్ళు మాకు అవసరం లేదు అన్నాడు.

గయ్యాలి గంగమ్మ – Telugu Moral Stories

గయ్యాలి గంగమ్మ అంటే చుట్టు పక్కల వారికి హడల్. చిన్న చిన్న విషయాలకే అందరితో గొడవ పెట్టుకొని నోరు పారేసుకొనేది. ఆమె ఇంటి పక్కనే ఆనందయ్య అనే రైతు వుండేవాడు. ఒకసారి అతని బండికింద పడి గంగమ్మ కోడిపిల్ల చనిపోయింది. అది చూసి గయ్యాలి గంగమ్మ “నా డబ్బులు నాకు ఇవ్వమని” గొడవ పెట్టుకుంది.

“కోడిపిల్ల చాలా చిన్నది. సంతలో పది రూపాయలకు దొరుకుతుంది. కావాలంటే యాభై రూపాయలు తీసుకొని నన్ను వదిలెయ్యి” అన్నాడు ఆనందయ్య. కానీ గంగమ్మ ఒప్పుకోలేదు. “ఆ కోడిపిల్ల పెద్దగయితే రోజూ ఒక గుడ్డు పెట్టేది. పిల్లలు పొదిగేది. వాటిని అమ్మితే ఎంతో డబ్బు వచ్చేది. నీ వల్ల నా సంపాదనంతా పోయింది. కాబట్టి వేయి రూపాయలు ఇవ్వవలసిందే” అని గొడవ పడింది.

ఆనందయ్య ఆమె నోటికి భయపడి కళ్ళనీళ్ళతో ఆమె చేతిలో వేయి రూపాయలు పెట్టాడు. కొంతకాలం గడిచింది. గంగమ్మకు ఒక బరగొడ్డు వుంది. అది ఒకరోజు ఆనందయ్య ఇంటిలోకి పోయి అక్కడున్న మామిడి మొక్కలన్నీ తిని వేసింది. దాంతో ఆనందయ్య ఆ ఊరి పెద్ద వద్ద పంచాయితీ పెట్టాడు.

“నా మామిడి మొక్కలు పెద్దగయితే వందల వందల కాయలు కాసేవి. వాటిని అమ్మితే ఎంత కాదన్నా పదివేల రూపాయల పైన్నే వచ్చేది. కాబట్టి మీరే నాకు ఆ డబ్బులు ఇప్పించాలి” అన్నాడు. “చిన్న మొక్కలకు పది వేలా… నేనివ్వను” అంది గంగమ్మ. అంతకు ముందు జరిగినదంతా తెలుసుకున్న ఊరి పెద్ద … “చిన్న కోడిపిల్ల వేయి రూపాయల విలువ చేసినప్పుడు మామిడిమొక్క ఎందుకు చేయదు. పది మొక్కలకు పదివేల రూపాయలు కడతావా… లేక కారాగారానికి పోయి చిప్పకూడు తింటావా” అన్నాడు కోపంగా. గయ్యాలి గంగమ్మ కిక్కురుమనకుండా డబ్బులు కట్టేసింది. అప్పటినుంచి ఇరుగుపొరుగుతో గొడవ పెట్టుకోవడం మానేసింది.

మూడు బొమ్మల రహస్యం – Telugu Moral Stories

ఒక రాజు ఆస్థానానికి ఒక శిల్పి వచ్చాడు. తన చేతిలోని మూడు బొమ్మలు రాజు ముండు వుంచాడు. రాజా… ఈ బొమ్మలు చూడ్డానికి ఒకేలా వున్నా ఇందులో చాలా తేడా వుంది. ఈ సభలో ఎవరైనా ఆ రహస్యం కనిపెట్టగలరా అని సవాలు విసిరాడు. అందరూ వాటిని పరిశీలించారు. ఎక్కడా కొంచంగూడా తేడా లేదు. ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు.

ఆ రాజ్యపు మంత్రి మహా మేధావి. ఎటువంటి చిక్కుముడి అయినా విప్పగల శక్తి గలవాడు. అతడు అచ్చు గుద్దినట్లు ఒకేలా వున్న ఆ మూడు బొమ్మలను బాగా పరిశీలించాడు. ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. సన్నని గడ్డి పోచలు మూడు తెప్పించాడు. ఒకదానిని మొదటి బొమ్మ చెవిలో దూర్చాడు. అది అవతలి చెవినుండి బైటికి వచ్చింది. ఇంకొకదానిని రెండవ బొమ్మ చెవిలో దూర్చాడు. అది నోటిలోంచి బైటికి వచ్చింది. మరొకదానిని మూడవదాని చెవిలో దూర్చాడు. అది లోపలికి పోయింది కానీ బైటకు రాలేదు.

మంత్రి చిరునవ్వు నవ్వుతా రాజా… ఈ మూడు బొమ్మలు మనుషుల యొక్క మూడు స్వభావాల గురించి వివరిస్తున్నాయి. మొదటి బొమ్మ చూశారా… గడ్డిపోచ ఈ చెవిలొంచి ఆ చెవిలోకి వచ్చింది. అంటే వీళ్ళు ఏదీ మనసు పెట్టి వినరు. పట్టించుకోరు. ఇటువంటి వాళ్ళకు ఏం చెప్పినా వ్యర్థమే. రెండవ బొమ్మ చూడండి. చెవిలోంచి దూర్చితే నోటిలోంచి బైటికి వచ్చింది. అంటే వీళ్ళు మనసులో ఏదీ దాచుకోరు. ఇటువంటి వాళ్ళతో చాలా ప్రమాదం. వీళ్ళకి పొరపాటున గూడా మన రహస్యాలు చెప్ప కూడదు.

ఇక ఈ మూడవ బొమ్మ చూడండి. దీని చెవిలో దూర్చిన గడ్డిపోచ ఎక్కడనుండీ బైటికి రాలేదు. అంటే వీళ్ళు ఏది చెప్పినా మనసులో భద్రంగా దాచుకుంటారు. పొరపాటున కూడా నోరు విప్పరు. లోకంలో ఇటువంటి నమ్మకస్తులు చాలా తక్కువ. ఇదే ఈ మూడు బొమ్మల రహస్యం అన్నాడు. ఆ సమాధానం విని శిల్పితో బాటు సభలోని వారందరూ ఆనందంతో చప్పట్లు చరిచారు.

భయం లేని జీవితం – Telugu Moral Stories

ఒక అడవిలో కొన్ని కుందేళ్ళు వున్నాయి. ఆ కుందేళ్ళు అన్నీ ఒకచోట సమావేశం అయ్యాయి. మనసులు విప్పుకున్నాయి. బాధలు చెప్పుకున్నాయి. ఒక కుందేలు లేచి మనదీ ఒక జీవితమేనా… ఏది తినాలన్నా భయం. ఎక్కడికి పోవాలన్నా భయం. ఏ జంతువు ఎప్పుడు ఎలా ఎటువైపు నుండి మీద పడుతుందో తెలీదు. చిన్న అలికిడికి కూడా ఉలిక్కి పడుతున్నాం. చీటికీమాటికీ బెదిరిపోతున్నాం. ఇలా జీవించడం కన్నా చావడమే మంచిది అనింది.

మిగతా కుందేళ్ళు కూడా అవును నిజమే… నిమిష నిమిషానికి ఇలా భయపడుతూ జీవించడం కన్నా ఒకేసారి చావడమే మంచిది. పదండి పోదాం అన్నాయి.
అన్నీ కలసి చావడానికి ఒక చెరువు దగ్గరికి బైలుదేరాయి. ఆ చెరువు గట్టు మీద చాలా కప్పలు వున్నాయి. అవి దూరం నుంచే కుందేళ్ళ గుంపును చూసి భయంతో వణికిపోయాయి.

అమ్మో… ఎన్ని కుందేళ్ళ చూడండి. వాటి కాళ్ళకింద పడితే అక్కడికక్కడే చచ్చిపోతాం. పారిపోండి. పారిపోండి అంటూ తలా ఒక దిక్కు ఎగురుతా దుంకుతా భయంతో వెళ్ళిపోయాయి. అది చూసి కుందేళ్ళు అవాక్కయ్యాయి. వాటి నోట మాట రాలేదు. అరే… మనమే అందరికీ భయపడతా వున్నాం అనుకుంటే మన కుందేళ్ళని చూసి భయపడేవి కూడా చాలా వున్నాయి.

నిజమే లోకంలో అన్నీ ఏదో ఒకదానికి భయపడుతూనే వుంటాయి. భయం లేనిది ఈ లోకంలో ఏదీ వుండదు. ఇదింతదానికి మనం చావాలి అనుకోవడం అవివేకం అనుకున్నాయి. దాంతో కుందేళ్ళు తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి.

నిరాడంబరత్వం – Telugu Real Stories

మహాత్మా గాంధీ జీవన విధానం, నిరాడంబరత్వం మనందరికీ తెలిసిందే. ఒకసారి గాంధీ ఇంగ్లాండ్ కు వెళ్ళినప్పుడు బ్రిటిష్ చక్రవర్తి ఐదవ జార్జి విందుకు బకింగ్ హోం ప్యాలెస్ కు ఆహ్వానించాడు. చక్రవర్తితో కలవడానికి మహాత్మాగాంధీ సూటూ బూటూ వేసుకొని దర్జాగా వస్తాడని అండరూ భావించారు. కానీ మహాత్మాగాంధీ ఎప్పటిలాగే మోకాళ్ళ పైకి గోచీ కట్టి, తెల్లని శాలువా కప్పుకొని, మొలలో గడియారం, కాళ్ళకు చెప్పులతో పల్లెల్లో సాధారణమైన భారతీయుడు ఎలా వుంటాడో అదే రూపంలో అడుగు పెట్టాడు.

అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకతను మీరు ఎందుకు ఇటువంటి బట్టలు ధరిస్తారు అని అడిగితే గాంధీ చిరునవ్వుతో మీరు ప్లస్ నాలుగు ధరిస్తారు. నేను మైనస్ నాలుగు ధరిస్తాను. ఐనా మాకు సరిపోయే బట్టలు కూడా మీరే ధరిస్తున్నారు గదా అని నవ్వేశాడట.

బలవంతునితో భాగం కలవకు – Telugu Moral Stories

ఒక అడవిలో ఒక సింహం వుంది. ఆ సింహం ఒకరోజు మూడు కుక్కలు ఒక నక్కతో కలసి వేటకు బైలుదేరింది. ఉదయం నుంచీ సాయంకాలం వరకూ అవి కలసి ఐదు జింకలను వేటాడాయి. వీటిని ఎలా పంచుకుందాం అంది సింహం. వెంటనే ఒక కుక్క దానికేముంది చాలా సులభం. మనం ఐదు మందిమి వున్నాం. ఐదు జింకలు వేటాడాం. తలా ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనింది.

ఆ మాటలు వింటూనే సింహానికి చాలా కోపం వచ్చింది. పంజాతో కుక్కను ఒక్కటి పెరికింది. అంతే… ఆ దెబ్బకు దాని దవడ పగిలి ఎగిరి పడింది. మిగతావన్నీ భయంతో వణికిపోయాయి. ఏదీ నోరు తెరవలేదు. అంతలో నక్క ముందుకు వచ్చింది. మహారాజా… ఈ కుక్కలకు కొంచం కూడా తెలివి లేదు. వీటికి అస్సలు లెక్కలూ రావు. అందుకే అది పొరపాటు చేసింది. నేను సమానంగా పంచుతాను అనింది.

సింహం సరే అనింది. సింహం మనకు రాజు. దానికి నాలుగు జింకలు ఇవ్వాలి. అప్పుడు ఒక సింహం నాలుగు జింకలు కలసి ఐదవుతాయి. అలాగే సేవకులైన మనం నలుగురం. మనం ఒక జింక తీసుకోవాలి. అప్పుడు ఒక జింక, మనం నలుగురం కలసి ఐదవుతాయి. అటు ఐదు. ఇటు ఐదు. రెండు వైపులా సమానంగా సరిపోతాయి అని చెప్పింది.

నక్క పంచిన విధానం సింహానికి చాలా బాగా నచ్చింది. శభాష్ నక్కా.. నువ్వు చాలా తెలివైనదానివి. ఇలా సమానంగా భాగాలు చేయడం ఎవరి వద్ద తెలుసుకున్నావు అనింది. నక్క వినయంగా సింహం రాజా… ఇందాకే మీరు పంజాతో కుక్క దవడ పగలగొట్టారు గదా… ఆ మూతి పగిలిన కుక్కను చూశాకే నాకు ఈ తెలివితేటలు వచ్చాయి. మీరే నాకు గురువు అనింది.

నక్క తాబేలు – Telugu Moral Stories

ఒక చెరువులో ఒక తాబేలు వుండేది. ఆ తాబేలు ఒక రోజు చెరువు బైటికి వచ్చి హాయిగా అటూఇటూ తిరగసాగింది. అదే సమయంలో ఒక నక్క ఆహారం కోసమని అటువైపు వచ్చింది. అది తాబేలుని చూసింది. అంతే… లటుక్కున దానిని పట్టేసుకుంది. వెంటనే తాబేలు భయంతో తన తల డిప్పలోకి ముడుచుకుంది. నక్క తాబేలుని తిందామని అటూఇటూ తిప్పి చూసింది. నోటితో కొరికింది. అంతా గట్టిగా వుంది. దానిని ఎలా తినాలో తెలీక బండకేసి బాదబోయింది.
అప్పటివరకూ లోపల ముడుచుకున్న తాబేలు నక్కబావా… ఆగాగు. ఎందుకంత తొందర. నేను నీళ్ళలో వున్నప్పుడు మెత్తగా వుంటాను. బైటికి రాగానే రాయిలా గట్టిగా మారతాను. నన్ను నువ్వు తినలేవుగానీ వదిలేసి పో అనింది.

నక్క నవ్వి ఐతే నీళ్ళలోనే నిన్ను నానబెట్టి మెత్తగా అయినాక తింటాను అంటూ దానిని నీళ్ళలో వేసింది. అది పారిపోకుండా గట్టిగా కాలితో అదిమి పట్టుకుంది.
ఒక అరగంట తరువాత ఏమి తాబేలు మెత్తగా అయ్యావా ఇప్పుడు అనింది. అంతా మెత్తగా అయ్యానుగాను గానీ నీ కాలు వున్నచోట నీళ్ళు తగలక గట్టిగా అలాగే వున్నా అనింది తాబేలు.

అలాగా ఏది చూద్దాము అంటూ నక్క కాలు తీసింది. అంతే ఇంకెక్కడి తాబేలు నక్క అలా కాలు తీయగానే ఇలా సర్రున జారుకుంది.

ఎవరికీ దొరకని గబ్బిలం – Telugu Moral Stories

ఒక అడవిలో ఒక గబ్బిలం వుండేది. గబ్బిలల గురించి మీకు తెలుసు కదా… అవి పక్షిలాగా ఎగురుతాయి. జంతువులాగా పిల్లలని కంటాయి. క్షీరదాల జాతికి చెందినవి. ఆ గబ్బిలం పొద్దునంతా ఏదో ఒక చెట్టుకు తలకిందులుగా వేలాడుతా వుండేది. చీకటి పడగానే అడవంతా తిరుగుతా వుండేది. ఒకసారి ఆ అడవిలో పక్షులకు, జంతువులకు నడుమ పెద్ద గొడవ జరిగింది. జంతువులు కనబడితే పక్షులు మీదపడి ముక్కులతో పొడిచేవి. పక్షులు దొరికితే జంతువులు వాటి ఈకలు పీకి రెక్కలు విరిచేసేవి.

ఒకసరి ఒక చెట్టుకింద జంతువులు సమావేశం పెట్టుకున్నాయి. ఆ చెట్టుపైననే ఒక కొమ్మకు అతుక్కొని గబ్బిలం నిదురబోతా వుంది. అంతలో ఒక్కసారిగా పెద్దగాలి బలంగా వీచింది. అంతే పట్టుదప్పి అది దభీమని పక్షుల నడుమ పడింది. వెంటనే జంతువులు రేయ్… పక్షి దొరికింది. పీకండిరా దాని ఈకలని అంటూ పట్టుకున్నాయి.

గబ్బిలం అదిరిపడింది. వెంటనే ఆగండి… ఆగండి… రెక్కలున్నా నేనేమి పక్షిని కాదు. మీలాగే జంతువుని. పిల్లలని కంటాను. పాలు తాపుతాను అనింది. అది చెప్పింది నిజమని తెలుసుకొని జంతువులు దానిని వదిలి వేశాయి. ఇంకొకసారి పక్షులు అన్నీ ఒక చెట్టు కింద సమావేశం అయ్యాయి. అంతలో పైనున్న గబ్బిలం పట్టుజారి వాటి నడుమ పడింది.

వెంటనే అవి రేయ్… ఇదేదో ఎలుకలా వుంది. చంపండి దాన్ని అంటూ పట్టుకున్నాయి. గబ్బిలం వెంటనే వాటితో ఆగండి… ఆగండి… నేనేమీ జంతువును కాదు. మీలాగే పక్షిని. చూడండి ఎంత పెద్ద రెక్కలు వున్నాయో. జంతువులు ఎక్కడన్నా ఎగురుతాయా అనింది. దాంతో పక్షులు దాని రెక్కలు గమణించి వదిలివేశాయి. అలా గబ్బిలం అటు జంతువులకు దొరకక, ఇటు పక్షులకు దొరకక హాయిగా అడవిలో తిరగసాగింది.

సలహా – Telugu Moral Stories

ఒక రోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువుకు పోయింది. చెరువులోకి గాలం వేసి ఒడ్డున కూచుంది. కొద్ది సేపయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది. నెమ్మదిగా దానిని బయటకు లాగసాగింది. అంతలో ఆ పక్కనే ఉన్న ఒక కప్ప ‘పిల్లిమామా! ఆ చిన్న చేప నీకు ఏం సరిపోతుంది? దానిని నీళ్ళలో వదిలెయ్యి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో చాలా ఉన్నాయి. సులభంగా చిక్కుతాయి’ అని చెప్పింది. అది విని పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళలోకి వదలివేసింది.
మళ్ళీ నీళ్ళలో గాలం వేసి కూచుంది.

కొంచెం సేపటికి మరొక చేప గాలానికి చిక్కుకుంది. దానిని చూసిన ఒక తాబేలు • ఛీ… చీ… ఈ చేప ఒళ్ళంతా ఒకటే ముల్లు. ఇంతకంటే మంచి మంచి చేపలు చెరువులో కుప్పలు కుప్పలు వున్నాయి. దానిని వదిలేయ్’ అనింది. అది విని ఆ చేపను కూడా నీళ్ళలో వదిలేసింది పిల్లి. మళ్ళీ గేలం వేసి నీళ్ళలోకి చూడటం మొదలు పెట్టింది. ఒక గంట గడిచింది. దానికి ఆకలి బాగా పెరిగిపోసాగింది. అంతలో దాని గాలానికి ఒక పెద్ద చేప చిక్కింది.

పిల్లి సంబరంగా దానిని బైటికి లాగసాగింది. కానీ ఆ చేప చాలా పెద్దది. అదీగాక దానికి నీళ్ళల్లో చాలా బలం. అంతే… గట్టిగా ఒక్క లాగు లాగింది. అలా లాగేసరికి పిల్లి దభీమని కాలు జారి నీళ్ళల్లో పడి పోయింది. చేప తప్పించుకుని పారిపోయింది. అది చూసి చెట్టు మీద వున్న కొంగ ఏం పిల్లిమామా… కొంచమన్నా తెలివి వుందా లేదా నీకు… ఈ చెరువులో చిన్న చిన్న చేపలు ఎన్ని లేవు. వాటిని పట్టుకొని హాయిగా తినక ఆ పెద్ద చేపలతో నీకేం పని అంది. పిల్లికి ఏం చెప్పాలో అర్థం కాలేదు.

చుట్టూ వున్న వాళ్ళు మనం ఏం చేసినా ఏదో ఒక సలహా ఇస్తుంటారు. మనం సొంతంగా ఆలోచించుకోవాలిగానీ ప్రతి ఒక్కరి సలహా పాటించకూడదు అనుకుంది. అంతలో చీకటి పడింది. చేపలన్నీ వెళ్లిపోయాయి. దొరికిన వాటిని చేతులారా వదిలివేసినందుకు బాధపడుతూ ఆకలితో ఇంటి దారి పట్టింది పిల్లిమామ.

తగిన శాస్త్రి – Telugu Moral Stories

ఒక ఊరిలో ఒక రైతు వుండేవాడు. అతను పేదవాడు. కానీ చాలా మంచివాడు. ఉన్న రెండు ఎకరాల్లో కష్టపడి పని చేసుకుంటూ పొట్టపోసుకునేవాడు. ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ ఎవరు ఏ పని చెప్పినా చిరునవ్వుతో చేసేవాడు. అందరికీ సహాయపడేవాడు. ఆ రైతు గుడిసె పక్కన కొంచం ఖాలీ స్థలముంది.

ఆ స్థలంతో ఒక గుమ్మడి తీగను నాటాడు. కొన్ని రోజులకు ఆ గుమ్మడి తీగకు మంచి గుమ్మడి కాయలు కాశాయి. బాగా ఎరువులు వేస్తూ, కలుపు తీస్తూ పసిపిల్లోని లెక్క చూసుకున్నాడు. ఆ గుమ్మడికాయలు బాగా లవయ్యాయి. కానీ వాటిలో ఒక కాయ మాత్రం పది మంది మోసేంత పెరిగి పెద్దగయింది. ఊరంతా వచ్చి ఆ గుమ్మడికాయను చూసి అబ్బ… ఎంత లావుంది ఇది. మా జన్మలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి కాయను అని మెచ్చుకోసాగారు.

ఆ పేదవానికి ఆ గుమ్మడి కాయను ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఆ ఊరి గ్రామాధికారి దాన్ని ఎవరికీ ఇవ్వొద్దు. అమ్మొద్దు. తినొద్దు. మన రాజుకు గుమ్మడికాయ కూరంటే చాలా ఇష్టం. పోయి ఆయనకు ఇవ్వు అన్నాడు. ఆ రైతు సరేనని దానిని పెద్దబండి మీద వేసుకోని రాజు దగ్గరికి తీసుకు పోయి బహుమానంగా ఇచ్చాడు.

రాజు ఆ గుమ్మడికాయను చూసి అబ్బ… ఎంత లావుగా ముచ్చటగా వుంది ఈ కాయ అంటూ చాలా సంతోషించాడు. వెంటనే గుమ్మడికాయంత బంగారం తెప్పించి రైతుకు బహుమానంగా ఇచ్చాడు. ఆ రైతు ఆ బంగారం అమ్ముకొని పెద్ద మేడ కట్టుకొని హాయిగా కాలుమీద కాలేసుకొని బతకసాగాడు.
ఆ రైతు పక్కింటిలో ఒక సోమరిపోతు ఉన్నాడు. వానికి తాను కూడా ఎలాగైనా రాజు వద్ద బహుమానం సంపాదించాలి అనుకున్నాడు.

కానీ వానికి వ్యవసాయం చేయడానికి ఒళ్ళు ఒంగలేదు. ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తావుంటే ఇంట్లో వున్న ఎద్దు కనబడింది. దాంతో ఆ రోజు నుంచీ దానికి కొంచం గూడా పని చెప్పకుండా మూడు పూటలా బాగా మేపసాగాడు. అది పనీపాటా లేక తినీ తినీ బాగా కొవ్వుపట్టి కొండంత బలిసింది. అంత లావు ఎద్దు ఎక్కడా లేదని వూరంతా అనడం మొదలు పెట్టారు.

దాంతో వాడు సంబరంగా ఆ ఎద్దును తీసుకొని రాజు దగ్గరికి పోయాడు. ‘రాజా… మన రాజ్యంలో ఇంత లావు ఎద్దు ఎక్కడా లేదు. కాబట్టి దీనిని తీసుకొని దీని బరువంత బంగారం నాకివ్వండి’ అన్నాడు. ఈ రాజుకి వాని దురాశ అర్థమైంది. “ఒరేయ్… ఎద్దు పని దున్నడం. ఏవీ దున్ననంత వేగంగా ఎక్కువ ఎకరాలు దున్నితే నీ ఎద్దు గొప్పదవుతాది గానీ పోరంబోకు మాదిరి తిని కొవ్వు పట్టి లావయితే ఎట్లా గొప్పదవుతాది. చూడు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఎలా అల్లాడిపోతా వుందో. పనికొచ్చే జంతువును కూడా నీ తెలివి తక్కువతనంతో ఎందుకూ కొరగాకుండా చేశావు ” అంటూ వాన్ని బాగా తిట్టి, వీన్ని తీసుకుపోయి ఒక సంవత్సరం పాటు మన తోటలో అన్ని పనులు చేయించి, పని విలువ తెలిసేలా చేయండి అని ఆజ్ఞాపించాడు.

తోక లేని కోతి – Telugu Moral Stories

ఒక అడవిలో ఒక మామిడి చెట్టు పైన ఒక కోతి ఉండేది. దానికి అందమైన పొడవాటి తోక ఉండేది. ‘జింకకు కొమ్ములు అందం, నెమలికి పింఛం అందం, పులికి చారలు అందం, సింహానికి జూలు అందం. అలాగే నాకు నా తోక అందం’ అని ఆనందంతో మురిసిపోయేది. ఆ చెట్టు కింద ఒక కుందేలు , జింక ఉన్నాయి. వాటికి చిన్న చిన్న తోకలు ఉన్నాయి. అవి కోతి తోక చూసి బాగా అసూయపడేవి. దీని తోక ఎప్పుడో ఒకసారి విరిగి పోతే బాగుంటుంది అనుకునేవి. దానిని ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఏడిపించేవి. ఒకరోజు సాయంకాలం జింక, కుందేలు చెట్టు పైకి చూసి చాలా ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే కోతికి తోక లేదు. మొత్తం ఊడి పోయింది. అది చూసి అవి చాలా సంబరపడ్డాయి.

“ఓయ్… కోతీ… ఏమైంది నీ తోక. ఇప్పుడు నువ్వు ఎలా వున్నావో తెలుసా. అచ్చం ఈకలు పీకేసిన కోడిలాగా, గుండు కొట్టిచ్చుకున్న సింహం లాగా , తొండం లేని ఏనుగులాగా ఉన్నావు. మాకు చూడు ఇప్పుడు నీకన్నా పెద్ద పెద్ద తోకలు వున్నాయి” అంటూ పక పక పక నవ్వుతూ కోతిని వెక్కిరించాయి.
అంతలో చెట్టు మీద కూర్చున్న కోతికి దూరంగా ఒక పులి రావటం కనబడింది. వెంటనే అది ‘ఓ పిచ్చి జంతువులారా… నా తోకను నేనే కొండ కింద వున్న హనుమంతునికి నైవేద్యంగా ఇచ్చాను. ఆయన సంతోషించి శత్రువును ముందుగా కనిపెట్టే వరాన్ని నాకు ఇచ్చాడు. తోక కన్నా ప్రాణాలే ఎక్కువ ముఖ్యం కదా. అందుకే దాన్ని వదిలేసాను.

ఇదిగో ఇటువైపు కాసేపట్లో పులి వస్తుంది. మీరు తొందరగా దాక్కోండి” అనింది. రెండూ అలాగా అంటూ గబగబా దాక్కున్నాయి. అంతలో పులి అక్కడికి వచ్చి ఏమీ కనబడక వెళ్ళిపోయింది. దానితో కోతి చెప్పిన మాటలు నిజం అని జింక, కుందేలు నమ్మాయి. అవి గూడా తమ తమ తోకలని కత్తరించుకోని హనుమంతునికి నైవేద్యం పెట్టాయి. కానీ కోతి చెప్పినట్టు అవి శత్రువుల రాకను ముందుగానే కనిపెట్టలేక పోయాయి. అప్పుడు కోతి నవ్వి “చూడు మిత్రులారా… ఒక బోనులో ఇరుక్కుని నా తోక తెగి నేను బాధ పడుతుంటే ఓదార్చాల్సింది పోయి నన్నే వెక్కిరించి ఏడిపిస్తారా. అందుకే మీకు బుద్ధి రావాలని అలా చెప్పాను. ఇప్పుడు నాకే కాక మీకూ తోకలు లేవు. సరిపోయిందా” అంటూ అక్కన్నించి వెళ్ళిపోయింది.

కోతి ఉపవాసం – Telugu Moral Stories

ఒక గుడి దగ్గర ఒక చెట్టు ఉండేది. దాని మీద ఒక కోతి ఉండేది. అది రోజూ గుడికి వచ్చే పోయే వాళ్ళని బాగా గమనించేది. ఒకసారి శివరాత్రి వచ్చింది. గుడి పూజారులు , గుడికి వచ్చే భక్తులు ఏమీ తినకుండా ఆ రోజంతా ఉపవాసం చేయటం చూసింది. “ఆహా! నేను కూడా ఈ మనుషుల్లాగే ఒక్క రోజైనా ఉపవాసం ఉండాలి. అప్పుడు నాకు కూడా పుణ్యం వస్తుంది” అనుకొంది.

తరువాత రోజు ఆహారం కోసం ఎటూ పోకుండా కదలక మెదలక చెట్టుపైన ఏమీ తినకుండా అలాగే కూర్చుంది. పావు గంట గడిచింది.
దానికి ఒక అనుమానం వచ్చింది. ఏమీ తినకపోతే రేపటికంతా నీరసం వస్తుంది గదా. అప్పుడు ఆహారం సంపాదించుకోగలనో లేనో. ఎందుకైనా మంచిది ఈ రోజే తెచ్చి పెట్టుకుంటే ఉపవాసం పూర్తి కాగానే తినొచ్చు గదా అనుకొంది.

వెంటనే గుడి చుట్టుపక్కలంతా బాగా వెదికి నాలుగు అరటి పళ్ళు సంపాదించి వాటిని పక్కన పెట్టుకొని కూర్చుంది. ఒక పావుగంట గడిచింది. పక్కనే అరటి పళ్లు కనడుతూ వుంటే దానికి నెమ్మదిగా ఆకలి పెరగసాగింది. “ఇదేమి ఇంత నీరసంగా ఉంది. ఇప్పుడే ఇలా వుంటే రేపటికంతా ఎలా ఉంటుందో ఏమో… ఎందుకైనా మంచిది. ముందుగానే తొక్క వలుచుకొని పళ్ళను సిద్ధంగా ఉంచుకొందాం” అనుకొంది. వెంటనే అరటిపండ్ల తొక్కలు వలచి ఎదురుగా పెట్టుకుంది.
ఇంకో పావుగంట గడిచింది. దానికి ఆకలితో మరింత నీరసం పెరిగింది. అసలు రేపు పొద్దునకి అరటిపండ్లు తినే శక్తి తనకి ఉంటుందో లేదోనని అనుమానం వచ్చింది.

దాంతో “ఎందుకైనా మంచిది. ఒక పండును మింగకుండా, బుగ్గన పెట్టుకుంటాను. ఉపవాసం పూర్తి కాగానే గుటుక్కున మింగవచ్చు. తినడం తప్పు గానీ బుగ్గన పెట్టుకోవడం తప్పు కాదు కదా” అనుకుంది. వెంటనే ఒక పండు తీసి నోట్లో బుగ్గన పెట్టుకుంది. మరో పావుగంట గడిచింది. పండు రసం తీయగా నోట్లో ఊరడం మొదలుపెట్టింది. దాంతో దానికి ఆకలి మరింత పెరిగిపోయింది. ఇక తట్టుకోలేక ఛీ.. ఛీ! ఈ ఉపవాసాలు చెడ్డ పనులు చేసి పుణ్యం కోసం తనకలాడే మనుషులకే కానీ మంచివాళ్ళమైన మాలాంటి కోతులకి కాదు” అనుకుంటూ అన్ని అరటి పండ్లను గబగబా తినేసింది. ఈ విధంగా ఒక రోజు అనుకున్న కోతి ఉపవాసం కాస్తా ఒక గంటలోనే పూర్తి అయ్యింది.

కోడి ఉపాయం – Telugu Moral Stories

ఒక అడవిలో ఒక దొంగ తోడేలు వుండేది. ఒకరోజు దానికి అడవి అంతా వెతికినా ఆహారం దొరకలేదు. కడుపు నకనకలాడసాగింది. పోతా పోతా ఉంటే దానికి ఒక చెట్టు కొమ్మ మీద కోడి కనిపించింది. ఎలాగైనా మోసం చేసి దానిని తినాలి అనుకుంది. ‘ ఓ కోడి! నీకు ఒక మంచి మాట చెబుతాను. అడవిలో జంతువులంతా ఇకపై కలసి మెలసి బంధువుల మాదిరి ఉండాలి. ఎవరూ ఎవరినీ చంపకూడదు అని నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇప్పటినుంచీ మనమంతా ఒకటే. కిందికి దిగిరా. ఆడుకుందాం’ అని పిలిచింది. కోడికి తోడేలు చేసే మోసాలు బాగా తెలుసు.

వెంటనే కొండ మీద నిటారుగా నిలబడి దూరంగా చూడసాగింది. “ఏం కోడిమామా… ఏమలా భయంతో నిటారుగా నిలబడి చేస్తున్నావు” అని అడిగింది తోడేలు.. “ఏం లేదు తోడేలు బావా! దూరంగా ఒక పులుల గుంపు ఇటు వైపే వేగంగా దుమ్ము లేపుకుంటు వస్తూ ఉంది. ఎన్ని ఉన్నాయా అని చూస్తున్నా’ అంది కోడి.

దాంతో తోడేలు పై ప్రాణాలు పైన్నే పోయాయి. “అయ్యబాబోయ్! పులుల గుంపా! అవి గానీ వచ్చాయంటే నా శరీరంలో ఒక్క ఎముక కూడా మిగలనియ్యవు నేవస్తా!” అని తోక ముడుచుకొని పారిపోబోయింది. ‘అదేంటి తోడేలు బావా! జంతువులంతా కలసి మెలసి ఆడుకోవాలని గ్త్యం తీసుకున్నాయని ఇప్పుడే చెప్పావు కదా! ఎందుకు భయ. అవి వస్తే హాయిగా ఆడుకోక’ అంది కోడి పకపక నవ్వుతూ. కోడిపిల్ల దగ్గర తన పప్పులు ఉడకవని తెలుసుకొని చల్లగా జారుకుంది తోడేలు.

కోతి ఉపవాసం – Telugu Moral Stories

ఒక గుడి దగ్గర ఒక చెట్టు ఉండేది. దాని మీద ఒక కోతి ఉండేది. అది రోజూ గుడికి వచ్చే పోయే వాళ్ళని బాగా గమనించేది. ఒకసారి శివరాత్రి వచ్చింది. గుడి పూజారులు , గుడికి వచ్చే భక్తులు ఏమీ తినకుండా ఆ రోజంతా ఉపవాసం చేయటం చూసింది. “ఆహా! నేను కూడా ఈ మనుషుల్లాగే ఒక్క రోజైనా ఉపవాసం ఉండాలి. అప్పుడు నాకు కూడా పుణ్యం వస్తుంది” అనుకొంది.

తరువాత రోజు ఆహారం కోసం ఎటూ పోకుండా కదలక మెదలక చెట్టుపైన ఏమీ తినకుండా అలాగే కూర్చుంది. పావు గంట గడిచింది. దానికి ఒక అనుమానం వచ్చింది. ఏమీ తినకపోతే రేపటికంతా నీరసం వస్తుంది గదా. అప్పుడు ఆహారం సంపాదించుకోగలనో లేనో. ఎందుకైనా మంచిది ఈ రోజే తెచ్చి పెట్టుకుంటే ఉపవాసం పూర్తి కాగానే తినొచ్చు గదా అనుకొంది.

వెంటనే గుడి చుట్టుపక్కలంతా బాగా వెదికి నాలుగు అరటి పళ్ళు సంపాదించి వాటిని పక్కన పెట్టుకొని కూర్చుంది. ఒక పావుగంట గడిచింది. పక్కనే అరటి పళ్లు కనడుతూ వుంటే దానికి నెమ్మదిగా ఆకలి పెరగసాగింది. “ఇదేమి ఇంత నీరసంగా ఉంది. ఇప్పుడే ఇలా వుంటే రేపటికంతా ఎలా ఉంటుందో ఏమో… ఎందుకైనా మంచిది. ముందుగానే తొక్క వలుచుకొని పళ్ళను సిద్ధంగా ఉంచుకొందాం” అనుకొంది. వెంటనే అరటిపండ్ల తొక్కలు వలచి ఎదురుగా పెట్టుకుంది.
ఇంకో పావుగంట గడిచింది. దానికి ఆకలితో మరింత నీరసం పెరిగింది. అసలు రేపు పొద్దునకి అరటిపండ్లు తినే శక్తి తనకి ఉంటుందో లేదోనని అనుమానం వచ్చింది.

దాంతో “ఎందుకైనా మంచిది. ఒక పండును మింగకుండా, బుగ్గన పెట్టుకుంటాను. ఉపవాసం పూర్తి కాగానే గుటుక్కున మింగవచ్చు. తినడం తప్పు గానీ బుగ్గన పెట్టుకోవడం తప్పు కాదు కదా” అనుకుంది. వెంటనే ఒక పండు తీసి నోట్లో బుగ్గన పెట్టుకుంది. మరో పావుగంట గడిచింది. పండు రసం తీయగా నోట్లో ఊరడం మొదలుపెట్టింది. దాంతో దానికి ఆకలి మరింత పెరిగిపోయింది. ఇక తట్టుకోలేక ఛీ.. ఛీ! ఈ ఉపవాసాలు చెడ్డ పనులు చేసి పుణ్యం కోసం తనకలాడే మనుషులకే కానీ మంచివాళ్ళమైన మాలాంటి కోతులకి కాదు” అనుకుంటూ అన్ని అరటి పండ్లను గబగబా తినేసింది. ఈ విధంగా ఒక రోజు అనుకున్న కోతి ఉపవాసం కాస్తా ఒక గంటలోనే పూర్తి అయ్యింది.

మేకలు కాసే పిల్లోడు – Telugu Moral Stories

ఒక ఊరిలో ఒక మేకలు కాసే పిల్లోడు వుండేవాడు. ఆ పిల్లోడు రోజూ అడవికి పోయి మేకలను తినడానికి వదిలి ఒక చెట్టుమీదకు ఎక్కి వాటిని పడుకునేవాడు. మరలా సాయంకాలం అన్నింటినీ లెక్కబెట్టి ఇంటికి తోలుకొని వచ్చేవాడు. ఒకరోజు ఎప్పటిలానే సాయంకాలం అన్నింటినీ ఒక దగ్గరకు చేసి లెక్క బెడితే ఒకటి తక్కువ వచ్చింది. ఎక్కడికి పోయిందబ్బా అని చుట్టుపక్కలంతా వెదికాడు. కానీ ఎంత వెదికినా ఎక్కడా కనబడలేదు. తరువాత రోజు సాయంకాలం కూడా అలాగే మరలా ఒకటి తక్కువ వచ్చింది.

అలా…. వరుసగా రోజుకొకటి తగ్గిపోసాగాయి. ఇలాగయితే లాభం లేదనుకుని ఒకరోజు ఆ పిల్లోడు చెట్టుమీద పండుకున్నట్టే పండుకొని నిదుర పోకుండా కళ్ళల్లో వత్తులేసుకొని కాపలా కాయసాగాడు. అంతలో ఒక పులి పొదల చాటుగా దాచి పెట్టుకుంటా వచ్చి ఒక గొర్రెపిల్లను నోట కరచుకొని పోవడం కనబడింది.
అది చూసి వాడు ఓహో ఇదా సంగతి అనుకున్నాడు. ఆ పులిని ఎలా దెబ్బతీయాలా అని ఆ రోజంతా బాగా ఆలోచించాడు. తరువాత రోజు గడ్డితో ,
గొర్రె బొచ్చుతో అచ్చం నిజమైన గొర్రె పిల్లనే అనుకునేలా ఒక గొర్రె పిల్ల బొమ్మను తయారు చేశాడు.

దానిని తీసుకొని అడవికి పోయాడు. అక్కడ ఐండలతో ఒక చిన్న ఇల్లు కట్టి లోపల దానిని కట్టేశాడు. కాసేపటికి పులి వచ్చింది. దానికి ఎక్కడా ఒక మేకగానీ గొర్రెగానీ కనబడలేదు. ఇదేందబ్బా వీడు ఈ రోజు వేటినీ తోలుకొని రాలేదు అని నిరాశగా ఆకలితో వెళ్లి పోతావుంటే… దానికి రాళ్ళ ఇంటిలో మేక బొమ్మ కనబడింది. అది బొమ్మని దానికి తెలీదు కదా… దాంతో సంబరంగా దానిని తినడానికి లోపలికి పోయింది.

ఎప్పుడయితే పులి పులి ఇంటిలోకి పోయిందో అప్పుడు ఆ పిల్లోడు వెంటనే చెట్టు దిగి వురుక్కుంటా వచ్చి చటుక్కున తలుపు మూసి బైట గొళ్ళెం పెట్టేశాడు. అంతే… పులి లోపల ఇరుక్కుని థింది. ఆ త …. నేడు ను వాడు. అంతే… రాళ్లన్నీ ఒకదానిమీద ఒకటి పెట్టినేవి కావడంతో దబదబదబ పడిపోయాయి. నిమిషాల్లో ఇళ్ళంతా కూలిపోయింది. దాంతో పులి లోపలే ఇరుక్కొని బండలు మీదపడి చచ్చిపోయింది. పులి పీడ విరగడ కావడంతో తరువాత రోజు నుంచి హాయిగా మేకలను తోలుకొని మరలా అడవికి రాసాగాడు.

బంగారు పిట్ట – Telugu Moral Stories

ఒక ఊరిలో ఒక రైతు వుండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. చిన్నవాడేమో చాలా మంచివాడు. మెతక. అమాయకుడు. కానీ పెద్దవాడు అలా కాదు. చాలా చెడ్డవాడు. దురాశాపరుడు. అన్నీ తనకే కావాలని కోరుకునేవాడు. కొంత కాలానికి ఆ రైతు జబ్బుపడి చనిపోయాడు. పిల్లలిద్దరూ వాళ్ళ నాయన సంపాదించిన డబ్బులు , పొలాలు సగం సగం పంచుకోవాల గదా. కానీ పెద్దాడు తమ్ముడిని ఇంటిలోనించి గెంటేసి అన్నీ తానే సొంతం చేసుకున్నాడు.

చిన్నవాడు బాధపడతా పక్కనేవున్న అడవిలోకి పోయాడు. కొంత భూమి చదును చేసి పొలంగా తయారు చేసుకున్నాడు. అక్కడే చిన్న ఇల్లు కట్టుకొని హాయిగా బదకసాగాడు. చిన్నోడు ఒకసారి అడవిలో పోతావుంటే ఒక బంగారు రంగు పిట్ట కనబడింది. దాని రెక్కలకు పెద్ద దెబ్బ తగిలి ఎగరలేక బాధతో విలవిలలాడతావుంది.

చిన్నోడు దానిని చూశాడు. పాపమని జాలిపడి బంగారుపిట్టను ఇంటికి తీసుకుపోయాడు. వారం రోజులపాటు దాని దెబ్బలకు మందు పూశాడు. తినడానికి గింజలు , తాగడానికి నీరు అందించాడు. దానితో దాని గాయం మానిపోయి అది హాయిగా గాలిలో ఎగర సాగింది. ఆ బంగారుపిట్ట ఒక బంగారు రంగు గుమ్మడిగింజ తీసుకొని వచ్చి చిన్నవానికి ఇచ్చి నాటమని చెప్పి ఎగిరిపోయింది. చిన్నోడు ఆ గుమ్మడి గింజను ఇంటిముందు తోటలో నాటాడు. తరువాత రోజు పొద్దునకంతా అది తోటంతా తీగలు వేసి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాసింది. చిన్నోడు సంబరంగా ఒక కాయ తెంపి కోశాడు. ఇంకేముంది…. దానినిండా బంగారు విత్తనాలు వున్నాయి. చిన్నోడు సంబరంగా వాటిని అమ్ముకొని పెద్ద మేడ కట్టుకొని హాయిగా బదకసాగాడు.

పెద్దానికి ఈ విషయం తెలిసింది. వాడు ఆ బంగారుపిట్ట కోసం అడవంతా వెదకసాగాడు. ఒకచోట ఆ పిట్ట గింజలు తింటా కనబడింది. దూరంనుంచి రాయి తీసుకొని దానిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అది గిలగిలా కొట్టుకుంటా కిందపడింది. వాడు ఏమీ తెలియని అమాయకునిలా అక్కడికి పోయాడు. ఆ బంగారుపిట్టను ఇంటికి తీసుకొని పోయి రోజూ దెబ్బలకు మందు పూయసాగాడు. వారం రోజుల తరువాత దాని దెబ్బలు మాని పోయాయి. అది అక్కడినుంచి ఎగిరిపోతూ వానికి ఒక ఎర్రరంగు గుమ్మడిగింజను ఇచ్చింది.

పెదోడు సంబరంగా ఆ గింజను నాటాడు. తరువాత రోజు పొద్దునకంతా అది ఇళ్ళంతా తీగలు వేసి కుప్పలు కుప్పలుగా కాయలు కాసింది. వాడు సంబరంగా ఒక దానిని కోశాడు. అంతే అదిరిపడ్డాడు. లోపలినుంచి తేళ్లు, జర్రులు వరుసగా వచ్చి ఇల్లూ తోటా అంతా నిండిపోయి వాన్ని కుట్టి కుట్టి పెట్టసాగాయి. అంతే… వాటి దెబ్బకు వాడు అదిరిపోయి ఇల్లూ పొలాలు వదిలేసి పారిపోయాడు.

పాలన మరచిన రాజు – Telugu Moral Stories

ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతను పరిపాలనను అస్సలు పట్టించుకునేవాడు కాదు. రోజూ అడవికి పోయి కనబడిన జంతువులనంతా వేటాడేవాడు. దాంతో రాను రాను అడవిలో జంతువులు బాగా తగ్గిపోయాయి. ఆ అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని కుటీరంలో చుట్టూ చాలా సాధుజంతువులు తిరుగుతుండేవి. రాజు వాటిని గూడా వదలకుండా వెదికి వెదికి వేటాడసాగాడు. అదంతా చూసిన ముని రాజును ఎలాగైనా సరే మంచిదారిలోకి తేవాలి అనుకున్నాడు.

ఒక రోజు రాజు సైనికులతో ఎప్పటిలాగానే వేటకు వచ్చాడు. కాసేపటికి ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ పెద్ద సింహాలగుంపు మెరుపు వేగంతో వారిపై దుంకింది. సైనికులంతా చెల్లాచెదురై తలా ఒకదిక్కు పారిపోయారు. రాజు చేతిలోని బాణం జారి కింద పడిపోయింది. అతను భయంతో పారిపోసాగాడు.
సింహం ఒకటి రాజు వెంట పడింది. పరుగెత్తీ… పరుగెత్త… అలసిపోసాగాడు. ఈ రోజుతో తనకు భూమి మీద నూకలు చెల్లినట్టే అనుకున్నాడు. అంతలో అతనికి కొద్ది దూరంలో ముని కుటీరం కనిపించింది. లేని సత్తువ తెచ్చుకొని వేగంగా ఉరుకుతూ వెళ్ళి ముని కాళ్ళ మీద పడ్డాడు .

ముని చిరునవ్వుతో పైకి లేపాడు. “భయపడకు రాజా! నా కుటీరంలోకి నా అనుమతి లేకుండా ఏ జంతువులూ రాలేవు. హాయిగా వుండు” అంటూ తాగడానికి చల్లని నీరు ఇచ్చాడు. సింహం కాసేపు బైటే నిలబడి ముని కనుసైగ చేయగానే వెళ్ళిపోయింది.
రాజు సేద తీరాక “చూడు రాజా… జంతువులకైనా, మనుషులకైనా బతుకు మీద తీపి ఒకటే. అడవిలోని జంతువులు ఊరి మీద పడినప్పుడో, పంటల మీద దాడి

చేసినప్పుడో రాజు వాటిని అదుపు చేయాలి. అంతేగానీ పరిపాలన గాలికి వదిలి ఇలా విందులు, వినోదాలతో గడుపుతే ఎలా… నీకేమయినా జరిగితే నిన్నే నమ్ముకున్న వాళ్ళ గతి ఏమవుతుంది” అంటూ నెమ్మదిగా మంచిమాటలు చెవికెక్కేలా చెప్పాడు.
ముని మాటలతో రాజుకు కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి నుంచీ విలాసాలు వదిలేశాడు. చక్కగా పరిపాలన సాగించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఏది గుడ్డిది – Telugu Moral Stories

ఒక రైతు దగ్గర ఒక ఆవు వుండేది. ఒక రోజు ఒక దొంగ
దాన్ని ఎత్తుకొని పోయాడు. రైతు చాలా బాధపడ్డాడు. ఇంటిలో
పాలకు ఇబ్బంది అయింది. ఇంకొక ఆవును కొందామని పక్క ఊరిలో
జరుగుతున్న సంతకు పోయాడు.

ఆ దొంగకూడా అదే సంతకు దొంగతనం చేసిన ఆవును
అమ్మడానికి తెచ్చాడు. అవును చూడగానే రైతు అది తనదే అని
కనుక్కున్నాడు. కానీ ఆ దొంగ ఆ ఆవు తనదే అన్నాడు. ఇద్దరూ
ఆవు నాదంటే నాదని గొడవ పడడంతో జనాలంతా చుట్టూ గుంపుగా
చేరారు.

అంతలో రైతు ఛటుక్కున ఆవు రెండు కళ్ళు మూసేసి ఈ ఆవు
నీదే అయితే దీని రెండు కళ్ళలో ఏది గుడ్దిదో చెప్పుకో చూద్దాం”
అన్నాడు.

దొంగకు ఎంత ఆలోచించినా ఏ కన్ను గుద్దిదో తెలియలేదు.
సరే ఏమైతే అదే కానీ ఒక రాయి విసిరి చూద్దాం అని ‘కుడివైపుది
అన్నాడు. రైతు “కాదు అన్నాడు.

వెంటనే దొంగ తడబడుతూ కుడి వైపుది కాదు, ఎడమ వైపుది.
తొందరపాటులో మరిచిపోయా అన్నాడు.

రైతు జనాల వైపు తిరిగి “అయ్యలారా ! నిజానికి దీని రెండు
కళ్ళూ బాగానే వున్నాయి. దొంగను పట్టించడానికే ఒక కన్ను గుడ్దిదని
చెప్పాను. కావాలంటే చూడండి” అని చేతులు తీశాడు.

జనాలంతా ఆవు వంక చూశారు. రైతు చెప్పినట్టే ఆవు రెండు
కళ్ళూ బాగున్నాయి. దాంతో వాళ్ళు దొంగను మెత్తగ తన్ని ఆవును
రైతుకు అప్పగించారు

పిల్లోని తెలివి – Telugu Moral Stories

ఒకూరిలో ఒక దొంగ వున్నాడు. ఆ దొంగ ఒకరోజు దొంగతనం
చేసి నగలు , డబ్బులు మూటగట్టుకోని ఊరి బైటకు చేరుకున్నాడు.
అక్కడ ఒక లోతయిన బావి వుంది. ఆ బావి దగ్గర ఉన్న ఒక చెట్టు
కింద కూచోని డబ్బులు లెక్క పెట్టుకోసాగాడు.

ఆ బావికి కొంచం దూరంలో ఒక మేకలు కాసే పిల్లోడు వున్నాడు.
వాడు దొంగను చూశాడు. ఆ పిల్లోడు చాలా తెలివైనోడు. “ఎలాగైనా
సరే దొంగను పట్టుకోవాలి” అనుకున్నాడు.

వెంటనే గట్టిగా ఏడుచుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చి తొంగి
చూడడం మొదలు పెట్టాడు. ఆ ఏడుపు విన్న దొంగ పిల్లోని దగ్గరికి
వచ్చి “ఎవరునువ్వు… ఎందుకలా బాధ పడుతున్నావు” అని అడిగాడు.

ఆ పిల్లోడు కళ్ళు తుడుచుకుంటూ “ఇందాక నీళ్లు తాగుతుంటే
నా వేలికున్న బంగారు ఉంగరం బావిలో పడిపోయింది. ఇంటికి పోతే
మా అమ్మ కిందామీదా ఏసి తంతాది” అన్నాడు.

ఆ దొంగకు ఉంగరం మీద ఆశ పుట్టింది. నగలమూట గట్టున
పెట్టి “నేను దిగి ఉంగరం వెదుకుతా. అంతవరకూ ఈ మూట
కనిపెట్టుకొని వుండు” అంటూ తాడు పట్టుకొని లోనికి దిగాడు. దొంగ
అలా బావిలోకి దిగగానే ఆ పిల్లోడు ఆ తాడును గబగబా పైకి లాగేశాడు.
దాంతో ఆ దొంగ పైకి రాలేక బావిలోనే ఇరుక్కు పోయాడు. వెంటనే
ఆ పిల్లోడు ఉరుక్కుంటా ఊరిలోకి పోయాడు. విషయమంతా వివరించి
జనాలందరినీ పిలుచుకొని వచ్చాడు. వాళ్ళంతా దొంగను పైకిలాగి
మెత్తగా తన్ని భటులకి అప్పజెప్పారు.

20 Moral Stories in Telugu For Children – నీతి కథలు – పిట్ట కథలు, Short Stories in Telugu, Pitta kathalu, neethi kathalu, telugu kathalu

Like and Share
+1
2
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks